తెలుగు మీడియాలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోంది. రానురాను మీడియాలో పనిచేస్తున్న వారి స్థితి తీసికట్టు అన్న చందంగా మారుతోంది. యాజమాన్యాల సొంతప్రయోజనాల కోసం సిబ్బంది బలికావాల్సి వస్తోంది. వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర చట్టపర సదుపాయాలు వంటివి కనుచూపుమేరలో కానరాక నానా కష్టాలు పడాల్సిన దుస్థితి. కుటుంబజీవనం అంతంతమాత్రంగా మారడంతో ఒకనాడు ధీమాగా బతికిన మీడియా సిబ్బంది, ఇప్పుడు దిక్కులేని స్థితిలో బతుకుతున్నారు. ఒకటీ, అరా మినహా అన్ని మీడియాసంస్థలు అలానే వ్యవహరిస్తున్నాయి. అందుకే వివిధ సంస్థల్లో సిబ్బంది పట్ల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరును ఓ మారు గుర్తు చేసుకుందాం..
తెలుగు మీడియాలోని స్థితిగతులపై సేకరించి సమాచారం మీకందిస్తున్నాం..మీ అభిప్రాయాలు కూడా పంచుకోండి. వాస్తవాలు అందరికీ తెలిసేలా సహకరించండి
1) హెచ్ఎమ్ టీవీ: తెలుగు మీడియాలో ఉద్యోగుల వేతనాలు సక్రమంగా చెల్లించే సంస్థల్లో హెచ్ఎమ్ టీవీ ఒకటి. ప్రతీనెలా నిర్థిష్ట సమయంలో జీతాలు ఇవ్వడమే కాకుండా, ఇతర అలవెన్సులు, బిల్లుల విషయంలో వామనరావు కు చెందిన ఈ సంస్థ కాస్త పక్కాగా వ్యవహరిస్తోంది. పీఎఫ్, ఈఎల్స్ వంటి వాటి విషయంలో చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ హెచ్ఎమ్ టీవీ ఉన్నంతలో బెస్ట్ గా చెప్పవచ్చు.
2) ఈటీవీ: రాజగురు నేతృత్వంలోని సంస్థల్లో సిబ్బంది పాలసీ కాస్త పెర్ ఫెక్ట్ గానే ఉంటుంది. వేతనాలు చెల్లింపులో గానీ, ఇతర చట్టపర సదుపాయాల కల్పనలో గానీ కాస్త సానుకూలంగా స్పందించేవి. కానీ ఇటీవల కొన్ని ఒడిదుడుకులు కూడా వచ్చాయి. యాజమాన్యం వైఖరిలో వచ్చిన మార్పు కారణంగానే ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ ఈటీవీ సిబ్బంది విషయంలో ఉన్నవాటిలో మెరుగ్గానే ఉంది.
3) వీ6 న్యూస్: మాజీ ఎంపీ వివేక్ ఆధ్వర్యంలోని ఈ ఛానెల్ సిబ్బంది కాస్త సౌకర్యవంతంగానే ఉంటారు. ప్రతీనెలా మొదటివారంలో చెల్లించే వేతనాల విషయంలో ఎప్పుడూ పెండింగ్ లేకుండానే చెల్లింపులు సాగిస్తున్నారు. ఇతర బిల్స్, అలవెన్సులు కూడా అంతా పక్కాగా చెల్లిస్తారు. పీఎఫ్ వంటి విషయంలో కూడా చాలావరకూ చట్టం అమలుకోసం ప్రయత్నిస్తారు. ఏపీలో సిబ్బందిని తొలగించినప్పుడు ఉదారంగా వ్యవహరించడంలో ఈఛానెల్ యాజమాన్యం ముందు నిలిచింది. కాబట్టి సిబ్బందికి మెరుగైనా ఛానెల్స్ లో ఇదొకటి.
4) ఎన్టీవీ: సిబ్బంది వేతనాలు, ఇతర బిల్లుల చెల్లింపులో నరేంద్ర చౌదరి ఛానెల్స్ కూడా కాస్త సక్రమంగానే వ్యవహరిస్తున్నాయి. అందుకే ఇక్కడ పనిచేయడం సౌఖ్యమేనని సిబ్బంది భావిస్తారు. పెద్దగా ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో సిబ్బందికి సానుకూలంగా ఉండే సంస్థల్లో ఎన్టీవీ కూడా ఒకటిగా చెప్పవచ్చు.
5) టీవీ5 ఆదాయం సంపాదనలో ముందువరుసలో ఉండే ఈ ఛానెల్స్ లో సిబ్బందికి ప్రతీనెలా వేతనాలు సక్రమంగా చెల్లిస్తున్నారు. బీఆర్ నాయుడు నడిపిస్తున్న ఈ ఛానెల్ లో కింది స్థాయి కెమెరామేన్లు సహా చా్లామందికి అతి తక్కువ వేతనాలు మాత్రమే ఇస్తారు. అయినప్పటికీ చెల్లింపుల విషయంలో జాప్యం లేకుండా చూస్తారు. ఇతర బిల్లులు, ప్రోత్సహాకాలు కూడా బాగా ఇస్తారు. కాబట్టి టీవీ5 ఫర్వాలేదు.
6) టీన్యూస్: అధికార పార్టీకి చెందిన ఛానెల్ లో సిబ్బంది వేతనాల చెల్లింపు సక్రమంగానే సాగుతోంది. కానీ చాలా ఛానెల్స్ తో పోలిస్తే జీతాలు మాత్రం కాస్త తక్కువగా ఇస్తారనే పేరుంది. ఇతర సదుపాయాల అమలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ నిర్థేశించిన జీతాలు ప్రతీనెలా సక్రమంగా చెల్లించే ఛానెల్స్ లిస్టులో ఇది కూడా ఒకటి.
7) ఏబీఎన్: మీడియాకు పాఠాలు చెప్పే స్థాయిలో తానున్నట్టు బావించే రాధాకృష్ణ ఛానెల్ కూడా సిబ్బంది వేతనాల విషయంలో ఉన్నంతలో మెరుగ్గానే వ్యవహరిస్తుంది. కానీ వాటి చెల్లింపు మాత్రం రెండో వారంలో చేస్తారు. ఈలోగా ఛానెల్ మారిపోయే చాలామంది వేతనాల విషయంలో మొండిగానే వ్యవహరిస్తారు. పీఎఫ్ ల విషయంలో కొంత ఆలశ్యమయినప్పటికీ ఫర్వాలేదు. ఏడాదికోమారు వేతనాల పెంపుదల విషయంలో కూడా రాకృ సమంజసంగానే వ్యవహరిస్తన్నారు. తెలంగాణాలో ఛానెల్ రాకపోయినప్పటికీ సిబ్బందికి మాత్రం వేతనాల చెల్లింపులో వెనకడుగు వేయలేదు. అందుకే ఏబీఎన్ కూడా సిబ్బందికి ఫర్వాలేదనిపించే ఛానెల్స్ లో ఒకటి.
8) టీవీ9: తెలుగు మీడియాలో తిరుగులేని స్థానం టీవీ9ది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నిలదొక్కుకుని ముందుకు సాగుతోంది. కానీ సిబ్బంది విషయంలో మాత్రం రవిప్రకాష్ తీరు కొన్ని మార్లు విమర్శలకు దారితీస్తుంది. ముఖ్యంగా తెలంగాణాలో నిషేధం ఎదర్కొన్న కాలంలో ఒక్కసారిగా వేతనాలు తగ్గించేయడం సంస్థ విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఆతర్వాత మళ్లీ వాటిని చెల్లించినప్పటికీ టీవీ9 బ్రాండ్ వాల్యూ మాత్రం పడిపోయింది. అయితే ఉన్నంతలో సిబ్బందికి సౌకర్యాల విషయంలో టీవీ9 ఫర్వాలేదని చెప్పవచ్చు.
9) ఎక్స్ ప్రెస్ టీవీ: సిబ్బందికి భారీగా నిర్ణయించిన వేతనాలు కూడా భారంగా భావించకుండా సక్రమంగా చెల్లించే సంస్థల్లో ఎక్స్ ప్రెస్ ఒకటి. ఎన్ఆర్ఐ సారధ్యంలో నడుస్తున్న ఛానెల్ లో సిబ్బంది వేతనాలు మొదటివారంలోనే చెల్లిస్తున్నారు. బిల్స్, ఇతర అలవెన్సుల విషయంలో కూడా తాత్సార్యం లేదు. కాబట్టి ఫర్వాలేదనిపించుకునే ఛానెల్స్ లో ఇదొకటి.
10) జెమినీ న్యూస్: సన్ నెట్ వర్క్ గ్రూప్ కి చెందిన ఈ సంస్థలో కూడా సిబ్బంది వేతనాల చెల్లింపులో సమస్యలుండవు. ఇక్కడ భోజనానికి రాయితీతో కూడిన క్యాంటీన్ సదుపాయం వంటి అదనపు అవకాశాలు కూడా ఉంటాయి. సిబ్బందికి చట్టపరమైన అనేక సదుపాయాలు కూడా కల్పిస్తారు. కాబట్టి జెమినీ న్యూస్ కూడా సిబ్బందికి ఫేవర్ గా ఉండే ఛానెల్స్ లో ఒకటి.
11) 10టీవీ ప్రజల సొమ్ముతో ప్రారంభించిన ఛానెల్ లో మొదట్లో అంతా మంచిగానే సాగేది. సిబ్బందికి సౌఖ్యంగా కనిపించేది. కానీ రానురాను అక్కడ పరిస్థితి దిగజారుతోంది. వేతనాలు ఎప్పుడిస్తారో కూడా తెలియని పరిస్థితి. బిల్లుల విషయంలో కూడా జాప్యమే సాగుతోంది. దాంతో ఆశలు నీరుగారుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఇది ఎంతవరకూ సౌఖ్యం అంటే ప్రస్తుతానికి సమాధానం లేని పరిస్థితి.
12) సాక్షి టీవీ: జగన్ కు చెందిన ఈ ఛానెలో తొలినాళ్లలో సిబ్బంది రాజభోగం అనుభవించారు. జిల్లాల్లో అయితే అనేక సౌకర్యాలతో విలాసంగా గడిపారు. కానీ మారిన రాజకీయ పరిణామాలు అక్కడి పరిస్థితిని పూర్తిగా తారుమారు చేశాయి. దాంతో వేతనాల కుదింపు అడ్డగోలుగా సాగింది. దాంతో అనేకమంది అవస్థలు ఎదర్కోవాల్సి వచ్చింది. వేతనాలు సక్రమంగా చెల్లించడంలోనూ, ఇతర వ్యవహారాల్లోనూ ఉన్నంతలో ఆలశ్యం కాకుండా చూస్తారు. కానీ వేతనాల్లో కోతతో ఈ ఛానెల్ క్రెడిబులిటీ బాగా పడిపోయింది.
13) సీవీఆర్ న్యూస్: అతిపెద్ద మీడియా నెట్ వర్క్ అని ప్రచారం చేసుకుంటున్న సీవీరావు కి చెందిన ఈ ఛానెల్ లో పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో సిబ్బంది ఆందోళనలు కూడా సాగిస్తున్నారు. ఛానెల్ ప్రారంభించినప్పటి నుంచి ఇంక్రిమెంట్స్ అన్నవే లేవిక్కడ. అయినా ఇచ్చేవి కూడా చెల్లింపులు ఆపేసి సిబ్బందితో ఆడుకుంటోంది ఇక్కడి యాజమాన్యం.
14) స్టూడియో ఎన్: ఇప్పటికే పలుమార్లు యాజమాన్యాల చేతులు మారిన ఈ ఛానెల్ లోకూడా అంత సౌకర్యవంతమైన వాతావరణం కనిపించదు. పలుమార్లు పెండింగ్ వేతనాల కోసం సిబ్బంది కుస్తీలు పట్టాల్సి వస్తుంది. దాంతో ఇది కూడా అంత సౌఖ్యం కాదని చెప్పవచ్చు.
15) మహాటీవీ: కేంధ్రమంత్రి సారధ్యంలో నడుస్తున్న ఈ ఛానెల్ పరిస్థితి మరీ దారుణం. అధికారం వెలగబెడుతున్న పెద్ద మనిషి ఆదర్శంగా ఉండాల్సింది పోయి తన ఛానెల్ లో పనిచేస్తున్న వారి పరిస్థితులు పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదు. దాంతో మహాటీవీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. జీతాలు ఇస్తారా..లేదా..ఎప్పుడిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అందుకే ఇక్కడ కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే పనిచేస్తుంటారని చెప్పకతప్పదు.
16) ఐన్యూస్: ఇక్కడ కూడా ఇంచుమించు అదే పరిస్థితి. మాజీ సీఎం బంధువు నడుపుతున్న ఛానెల్ లో కూడా సిబ్బంది బతుకులు అంతంతమాత్రమే. ఎందుకు పనిచేస్తున్నామో తెలియని పరిస్థితి కూడా పలుమార్లు దాపరిస్తుందిక్కడ. అవస్థల మయంగానే జీవనం నడుస్తోంది.
17) నెంబర్ వన్ న్యూస్: మూడు నెలల క్రితం ప్రారంభించినప్పటికీ సిబ్బందికి ముప్పుతిప్పలు తప్పడం లేదు. వేతనాలు చట్టవిరుద్ధంగా కనీసం బ్యాంక్ అకౌంట్లు కూడా లేని పరిస్థితి. అవికూడా ఎప్పుడో రెండోవారంలో ఇచ్చేవి కూడా సక్రమంగా లేవు. ఇతర సదుపాయాలన్నవి కానరావు.
18) 99టీవీ: కార్మికుల పక్షపాతులమని చెప్పుకుంటున్న కమ్యూనిస్టుల సారధ్యంలో వచ్చిన ఈ ఛానెల్ లో సిబ్బంది సమస్యలు అన్నీ ఇన్నీ కావు. నెలల తరబడి వేతన బకాయిలతో ఇతర అనేక సమస్యలున్నాయి. అయినా కొంతమంది అనివార్య పరిస్థితుల్లో పనిచేస్తున్నా వారి జీవనభృతి కూడా చెల్లించడకపోవడం దుర్మార్గంగా కనిపిస్తోంది.
ఇవి కాకుండా చిన్నా చితకా, ఉండీ లేనట్టు, వచ్చీరానట్టు ఉన్న ఛానెల్స్ కూడా ఉన్నాయి. అలాంటి చోట్ల పరిస్థితులు మరింత దారుణంగా కనిపిస్తున్నాయి. అయినా కార్మిక శాఖ, జర్నలిస్టు సంఘాలు, ఇతరులు ఎవరికీ ఈ మీడియా సిబ్బంది బాధలు పట్టడం లేదు. దాంతో రానురాను పని ప్రమాణాలు మరింత దిగజారిపోయేలా కనిపిస్తున్నాయి.
No comments:
Post a Comment