ప్రపంచ వ్యాప్తంగా 2010లో మొత్తం 57 మంది పాత్రికేయులు హత్యకు గురయినట్లు అసోసియేటెడ్ ప్రెస్ ప్రకటించింది. అలాగే పాత్రికేయులకు పాకిస్తాన్ అత్యంత ప్రమాదకరంగా ప్రాంతమని విశ్లేషించింది. అత్యధిక పాత్రికేయులు నేరస్తుల చేతుల్లో మృతిచెందారు. 2009లో 76 మంది చనిపోయారు. వాస్తవానికి పాలకుల పరోక్ష, ప్రత్యక్ష మద్దతుతోనే పాత్రికేయులను నేరస్తులు దాడులకు పాల్పడుతున్నట్లు అనేక రుజువులున్నాయి. అందువలనే పాత్రికేయులను హత్యచేసినవారిని శిక్షించేందుకు ప్రభుత్వాలు పూనుకోవటం లేదు. 2010లో చనిపోయినవారిలో పాకిస్తాన్‌లో అత్యధికంగా 11 మంది, మెక్సికో, ఇరాక్‌లలో ఏడుగురి చొప్పున, ఫిలిఫ్పైన్స్‌లో నలుగురు మృతిచెందారు. 51 మంది పాత్రికేయులను అపహరించినట్లు వివిధ దేశాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఫ్రాన్స్ పాత్రికేయులు హర్వీ జెస్క్విరీ, స్టీఫెన్ టపోనియర్‌తోపాటు మరో ముగ్గురు ఏడాదికిపై నుంచే ఆఫ్ఘనిస్తాన్‌లో నిర్బంధంలో ఉన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.