తామర తంపరగా పుట్టుకొస్తున్న తెలుగు టెలివిజన్ ఛానెల్స్ జాబితాలో మరొక ఛానెల్ చేరబోతున్నది. తెలంగాణాలోని పెద్దపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎం.పీ. జీ.వివేక్ గారికి చెందిన విశాక ఇండస్ట్రీస్ ఈ ఏడాది నవంబర్ లో "వీ సిక్స్ (V-6)" అనే పేరుతో ఒక ఛానల్ ను తెచ్చేందుకు సిద్ధమవుతున్నది.
తెలుగు టెలివిజన్ జర్నలిజంలో 'హార్డ్ కోర్' చర్చలు జరపడంలో మంచి పేరు తెచ్చుకున్న అంకం రవి నేతృత్వంలో ఇది రాబోతున్నది. ఈ చానెల్ ఏర్పాటుకు రవి మంచి కసరత్తు చేసి...ప్రతిపాదనను ఒక కొలిక్కి తెచ్చారని సమాచారం. తెలంగాణా కాంగ్రెస్ నేత ఛానల్ కదా...ఇది మూడునాళ్ళ ముచ్చటేలే అనుకున్న నాకు హెచ్.ఎం.టీవీ లో అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేస్తున్న నా మంచి మిత్రుడు పసునూరి శ్రీధర్ బాబు (మాజీ ఇండియా టుడే జర్నలిస్ట్) ఒక షాక్ ఇచ్చారు. హెచ్.ఎం.టీవీ కోర్ కమిటీ సభ్యుడైన శ్రీధర్ "వీ సిక్స్" లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా చేరారు. తక్కువ కాలంలోనే ఎక్కువగా మిత్రుడైనా జర్నలిస్టు శ్రీధర్. ప్రతిభను పరిగణలోకి తీసుకుని శ్రీధర్ ను మంచి పదవిలో నియమించడం ఈ గ్రూప్ తీసుకున్న మంచి నిర్ణయమని నాకు అనిపించింది. వినోద్ వాళ్ళ ఇంట్లో పేర్లన్నీ "వి" తో ఆరంభమవుతాయట, అలాగే వారికి అచ్చివచ్చే సంఖ్య "ఆరు (సిక్స్)" అట. అందుకే అలాంటి పేరు పెట్టారట. నాకైతే పేరు నచ్చలేదు కానీ...రవి-శ్రీధర్ సమన్వయంలో వచ్చే టీం పట్ల ఆసక్తి ఉన్నది.
కాంగ్రెస్ కు, తెలంగాణాకు కొమ్ము కాయడం తమ ఎజెండాలో లేకుండా ఛానల్ నడపాలని ఈ యాజమాన్యం భావిస్తున్నది...ప్రస్తుతానికి. అది మంచిదే కదా! ఈ చానెల్ వారైనా ఇష్టం వచ్చినట్లు జర్నలిస్టులను తీసుకుని...అనక భరించలేక వారిని ఇంటికి పంపబోరని, ఒక ఉద్యోగిని తొలగించడం ఒక హత్యతో సమానంగా భావిస్తారని, "వాడిని పీకుదాం...వీడిని పీకుదాం" అని పెద్ద కత్తి పట్టుకుని కూర్చొనే జర్నలిస్టు జాతి కంటక అమానుష ఎడిటర్లకు బుద్ధి వచ్చేలా వీరు ప్రవర్తిస్తారని నేను కోరుకుంటున్నాను.
తమకు తప్ప మరొకడికి పరిజ్ఞానం లేదని భ్రమల్లో బతికే మహనీయులు, మన అనుయాయులకు తప్ప వేరే వారిని బతకనివ్వకూడదని అనుకునే మహానుభావులు, జర్నలిజం లో నీతి-విలువలను అర్జెంటుగా పాతరెయ్యాలని కంకణం కట్టుకున్న వీరులు...నడుపుతున్న పోరంబోకు ఛానల్స్ కు భిన్నంగా కొత్త ఛానల్ తేవడానికి తెలుగులో వీలు ఉన్నది. ఆ గ్యాపును కొత్త చానెల్ ఎలా పూడుస్తుందో వేచి చూడాల్సిందే. తులసి వారి చానెల్, విజయవాడ కేంద్రంగా ఒక ఛానల్, చిరంజీవి ఛానల్ కూడా రాబోతున్నాయని అంటున్నారు.
నా మిత్రుడు శ్రీధర్ గురించి రాయకుండా ఈ పోస్టు ముగిస్తే అది తప్పవుతుంది. నల్గొండ జిల్లా కు చెందిన పసునూరి శ్రీధర్ బాబు చెన్నై లో ఇండియా టుడే పత్రికలో పనిచేస్తున్నప్పుడు హెచ్.ఎం.టీ.వీ. చీఫ్ ఎడిటర్ రామచంద్ర మూర్తి గారు తన కోర్ టీం లోకి ఆహ్వానించారు. విషయ పరిజ్ఞానం, విశ్లేషణా సామర్ధ్యం, సందర్భ శుద్ధి, ప్రజాస్వామ్యయుత భావన...అన్నింటికి మించి చక్కని తెలుగు రాసే సత్తా ఉన్న రచయితా-కవి శ్రీధర్ అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. శ్రీధర్ చేసే వార్తా వ్యాఖ్య కు మంచి రేటింగ్స్ వచ్చేవి, తన చర్చలు అర్థవంతంగా అనిపించేవి. శ్రీధర్ కు టీ.వీ.జర్నలిజం లో మంచి భవిష్యత్తు ఉంది. రవీ అండ్ శ్రీదర్...విష్ యు గుడ్ లక్.:- Ramu
source :- http://apmediakaburlu.blogspot.com/