సెలబ్రిటీలకు పెళ్లి సంబంధం కుదురుతుంన్న వార్త పిసరంత మీడియాకు అందితే చాలు ఛానల్‌లో ఆకాశమంత పందిరేసి భూదేవంత అరుగు అలికి పచ్చని తోరణాలు కట్టి వారి పెళ్లి జరిగేంతవరకు మీనాలో (్ఛనల్) ఊరేగిస్తూనే ఉంటారు. పాపం! వారు మాత్రం కావాలని చేస్తారా? 24 గంటల కవరేజీకి సరుకు కావాలి కదా? అందుకే పిలవని పేరంటానికి సైతం మేమున్నామంటూ వెళ్లిపోయి కవరేజ్ చేసేస్తూ ఉడతా భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు.
పెళ్లికొడుకు ఎన్నిసార్లు బయటకు వచ్చి మీడియాకు చిక్కకుండా వెళ్లిపోయాడో వార్త నుండి పెళ్లి కోసం తయారౌతున్న పిండి వంటల వరకు తెగ ఆశ్చర్యపోతూ ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలని ట్రై చేస్తారు. పిలవని పేరంటానికి తయారై వెళ్లిన యాంకరమ్మ సదరు సెలబ్రిటీ ఇంటి గేటు ముందో కల్యాణ మండపం బయటో ఛానల్ వారు లైవ్‌లో పిలిచేంతవరకు వేచి ఉంటుంది. తీరా లైన్‌లోకి తీసుకున్న తరువాత నోరు చప్పరించుకుంటూ చెప్పిందే చెప్పి కెమెరామెన్‌తో నానా తిప్పలు పడుతుంది. ఇలాంటి సన్నివేశాలు ప్రతి ఛానల్‌లో దర్శనమివ్వడంతో ప్రేక్షకుడు పరమ బోర్ ఫీలవుతున్నాడు.
లేనివాడు ఆకలితో ఏడుస్తుంటే ఉన్నోడు అరక్క ఏడ్చాడట. అలా ఉంటాయి సెలబ్రిటీల పెళ్లిళ్ల తీరు. పదిమందీ చెప్పుకోవాలని చేసుకునే హడావిడికి ఎక్కువమందిని రావద్దని శుభలేఖల్లో చెప్పకనే చెబుతారు. అయినా కూడా వేలల్లో జనాలు వస్తారు. వాటిలో ఛానల్స్ వారు కూడా ఉండటం వల్ల తాము చూసిన (నోరెళ్లబెట్టి) విషయాలను లక్షల్లో కాదు కోట్ల మందికి పదేపదే చెప్పే గురుతర బాధ్యతను భుజాన వేసుకుంటారు. ఏ ఛానల్‌లో చూసినా ఇదే వాయింపు.
కొన్ని ఛానల్స్ చేసుకున్న అదృష్టానికి పెళ్లి కార్యక్రమాన్ని లైవ్ ఓన్లీగా ప్రసారం చేసుకునే హక్కులు లభిస్తాయి. అంతే! ఆ ఓవర్ ప్రసారాలకు ప్రేక్షకులకు సైతం పెళ్లంటే ఇలా చేసుకోవాలి లేకపోతే పెళ్ళే చేసుకోకూడదనిపించేస్తుంది. అయి తే అందరి కీ సాధ్య పడుతుందా? వాళ్లు సెలబ్రిటీలు కనుక సాగుతుందని సరిపెట్టుకుని యధాప్రకారం పప్పన్నం లాగించేయాల్సిందే. అనుక్షణం హైరానా పడిపోతూ తెలుసుకోవాల్సినంత సీను సెలబ్రిటీల పెళ్లిళ్లకుందా అనేది సామాన్య ప్రేక్షకుడి మాట. అలాంటి హడావిడిని ఛానల్స్ సృష్టిస్తున్నాయనేది వీరి వాదన. పిలవని పేరంటానికి మేం వెళ్లాం కావాలంటే చూడండి దానికి మీరే సాక్ష్యం అన్నట్లు ప్రేక్షకులపై రుద్దే ధోరణిని ఛానల్స్ అనుసరిస్తున్నాయా? అనే అనుమానంలో ప్రేక్షకుడు కొట్టుమిట్టాడుతున్నాడు.
సెలబ్రిటీలు పర్సనల్ లైఫ్‌లోకి ఛానల్స్‌ని ఎలాగ ఎంటరవ్వనివ్వరు కనుక వారి రంగానికి సంబంధించి దొరికిన క్లిప్పింగ్స్ సినిమా పాటలతో తెగ హడావిడి చేసి (బులిటెన్ బులిటెన్‌కు) సంబరపడిపోతారు. ఏదో మూల సమాచారంతో సెలబ్రిటీలు నివసించిన, పుట్టిన ఊళ్లకు పోయి అక్కడి జనంతో కథనాలు అల్లడం మొదలెడతారు.
పెళ్లితంతు పూర్తయ్యేవరకు సెలబ్రిటీలు ఎలాగా దొరకరు. అంతవరకు ఊరుకుంటే రేటింగ్‌లో వెనుకబడి పోతామని భావించిన సదరు ఛానల్స్ ఆకాశమంత పందిరేసేవాణ్ని - భూదేవిని అలికి ముగ్గు పెట్టేవాడ్ని తీసుకొచ్చి గంటల తరబడి సోది కబుర్లు పెడతారు. పాశ్చాత్య వంటలతో నిత్యం ముద్ద దింపుకునే సెలబ్రిటీలు వెరైటీ కోసం (నేటివిటీ మరిచి) తెలుగు వంటలను విందుకు ఆర్డరిస్తే మీడియాకు పండుగే. వంట మాస్టర్ల వెంటబడి మరీ కవర్ చేస్తారు. ఆఖరికి ప్రదానం బోండాలపై కూడా కథనాలు ప్రసారం చేయాల్సిందేనని ప్రతినబూనతారు. ఇక పెళ్లి జరిపించే పండితుల సంగతి సరేసరి. వీళ్లంతా ఛానల్స్‌కి దొరికిపోయే విఐపిలు.
ప్రతి బులిటెన్‌లోనూ హేలీ తోకచుక్క కనిపిస్తుందన్నంత హడావిడి చేస్తూ మరి కొద్ది గంటల్లో మరి కొన్ని నిమిషాల్లో పెళ్లి ముహూర్తం అంటూ వారు ఆందోళన పడిపోతూ ప్రేక్షకులను టెలివిజన్ సెట్ల ముందు కూర్చోబెట్టడానికి వీరోచితంగా ప్రయత్నిస్తారు. మేమే ముందు చూపించాం.
మేమే ఎక్కువ మందికి చూపించాం అంటూ సంబరపడిపోతూ లోగో ముద్రను కార్యక్రమంపై వేసుకుంటారు.
పెళ్లి ముహూర్తాలున్న సమయాల్లో ఎన్నో జంటలు ఒకటవుతాయి. కాని సెలబ్రిటీల పెళ్లిళ్లే లోక కల్యాణం కోసం జరిగినట్లు ప్రత్యక్ష దైవాలకు జరిగినట్లు ఛానల్స్ పాత కొత్త క్లిప్పింగ్స్ కల్యాణ గీతాలతో ప్రసారం చేయడం రోజురోజుకీ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాయి. అతి హడావిడి ఇష్టపడేవారి చేత కూడా పెదవి విరిచేలా చేస్తుందని గమనించాలి. సినీ స్టార్స్.. క్రికెట్ స్టార్స్.. పారిశ్రామికవేత్తలు.. వంటి ఎందరో సెలబ్రిటీల పెళ్లిళ్లలో కనిపించే కృత్రిమ ఆనందం కంటే సామాన్య మానవుని పెళ్లిలో కనిపించే నిజమైన ఆనందమే ఎక్కువ కాలం నిలిచిపోతుంది. ఇటనైనా ఛానల్స్ సెలబ్రిటీల పెళ్లిళ్ల ఫోకస్ కోసం సారం ఏమీ లేకపోయినా ఏదో వున్న బిల్డప్ చేసే బులిటెన్‌లకు స్వస్తి పలికి హుందాగా పెళ్లి వార్తను పెళ్లి రోజు క్లిప్స్‌తో ప్రసారం చేస్తే ప్రేక్షకులు మరింతగా విశ్వసిస్తారు, ఆనందిస్తారు.
sorce :- http://www.andhrabhoomi.net
No comments:
Post a Comment